India Vs Pakistan: పురుషుల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు ముందు భారత్ మరోసారి పాకిస్తాన్‌పై ఆధిపత్యం చూపించింది. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్–ఏ జట్టు పాకిస్తాన్–ఏ జట్టును ఘోరంగా ఓడించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని టెర్డ్‌థాయ్ క్రికెట్ గ్రౌండ్ లో ఇవాళ జరిగిన గ్రూప్–A మ్యాచ్‌లో, భారత్–ఏ జట్టు తన ప్రత్యర్థి పాకిస్తాన్–ఏ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్–ఏ టీం టీమిండియా బౌలర్ల ధాటికి కుప్పకూలింది. సైమా ఠాకూర్ (2/14), రాధా యాదవ్ (2/11), ప్రేమా రావత్ (2/16) చెరో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుని కట్టడి చేశారు. దీంతో పాకిస్తాన్ జట్టు 18.5 ఓవర్లలో కేవలం 93 పరుగులకే ఆలౌటైంది.
94 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్–ఏ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ హుమైరా కాజీ వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన వృందా దినేష్ (55) హాఫ్ సెంచరీ చేసి ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఆమెకు తోడుగా అనుష్క శర్మ (24) కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. అ తర్వాత తేజల్ హసాబ్నిస్ చివర్లో చెలరేగిపోవడంతో భారత్–ఏ జట్టు 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలిచింది.
ఈ గెలుపుతో భారత్–ఏ జట్టు రెండు మ్యాచ్‌లలో ఒక విజయం సాధించి గ్రూప్–A పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో యూఏఈ చేతిలో ఓడిన భారత్, ఈ మ్యాచ్‌తో మళ్లీ తుది పోటీలోకి వచ్చింది. గ్రూప్–Aలో భారత్–ఏ టీం తన చివరి మ్యాచ్‌ను మంగళవారం నేపాల్‌తో ఆడనుంది. గ్రూప్‌లోని తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించనున్నాయి.
